తాజా వార్తలు

10/recent/ticker-posts

నూజివీడులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు


నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 16: రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా కూటమి నాయకులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, అది ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. ఆత్మనిగ్రహం, చిత్తశుద్ధి, అంకితభావం, క్రమశిక్షణ కలిగిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.

అమరజీవి త్యాగస్ఫూర్తిని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆయనకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. ప్రతి తెలుగువాడికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు ముందుకు తీసుకెళ్లినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళులు అర్పించినట్లవుతుందని తెలిపారు.

అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.