తాజా వార్తలు

10/recent/ticker-posts

కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రత్యేక ఆపరేషన్ల కొనసాగింపు


కాకినాడ, పశ్చిమవాహిని, మార్చి 16: జిల్లాలో 17 రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. శంకవరం మండలం మాసంపల్లి గ్రామం పరిసరాల్లో పెద్దపులి అడుగుజాడలు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి పి.వి.చలపతిరావు పరిశీలించారు. రాజమండ్రి ప్రధాన అటవీ సంరక్షణాధికారి శ్రీకంఠనాథ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు.

స్థానిక అటవీశాఖ సిబ్బంది, ప్రత్యేక బృందాలతో పులి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పెద్దపులిని గుర్తించి, సురక్షితంగా పట్టుకోవడానికి 11 హనుమాన్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా, అదనంగా 3 ట్రాంక్విలైజర్ బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ప్రస్తుతం.. పులి అడవి ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు అటవీశాఖ వెల్లడించింది. సరైన సమయం, సరైన ప్రదేశంలో పులిని సురక్షితంగా పట్టుకోవడమే తమ లక్ష్యమని అటవీ సిబ్బంది వెల్లడించారు. రాత్రి సమయంలో కూడా డ్రోన్ల ద్వారా పులి కదలికలను గమనిస్తూ పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.