ఆంధ్రప్రదేశ్, పశ్చిమవాహిని, మార్చి 16: గృహ వినియోగదారులకు అందించాల్సిన వంట గ్యాస్ సరఫరాలో ఆలస్యం జరుగుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారికంగా గ్యాస్ కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, బుక్ చేసిన సిలిండర్లు రెండు వారాలకిపైగా ఆలస్యంగా అందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వారం రోజుల క్రితం బుక్ చేసిన సిలిండర్లకు ఇప్పటికీ డెలివరీ లేకపోవడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటివరకు బుకింగ్ చేసిన రెండు మూడు రోజుల్లోనే సిలిండర్ అందుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని చెబుతూనే 10 నుంచి 15 రోజులు పడుతుందని ఏజెన్సీలు చెబుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. డెలివరీలపై సరైన సమాచారం ఇవ్వకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పారదర్శకతపై ప్రశ్నలు
కొన్ని గ్యాస్ ఏజెన్సీల కార్యకలాపాలపై వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లు బయట మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డెలివరీ సిబ్బంది ద్వారా సిలిండర్లు రూ.1,500 వరకు అమ్ముతున్నారనే సమాచారం వినిపిస్తోంది. గతంలో అదనంగా రూ.100 వసూలు చేసి సిలిండర్లు అందించేవారని, ప్రస్తుతం ఈ మొత్తం రూ.500కుపైగా పెరిగిందని వినియోగదారులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ స్టాళ్లు గృహ వినియోగ సిలిండర్లనే ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవి వినియోగదారుల పేర్లతో బుక్ చేసి బయటకు మళ్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ వివరాలు బోర్డులపై ప్రదర్శించడం లేదని, ఏ తేదీ బుకింగ్‌లకు డెలివరీ ఇస్తున్నారో కూడా వెల్లడించడం లేదని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్ల గందరగోళం నెలకొంది.
పర్యవేక్షణ లోపం
పౌర సరఫరాల శాఖ అధికారులు బయట చిల్లర దుకాణాలపై దాడులు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, గ్యాస్ ఏజెన్సీలపై మాత్రం తనిఖీలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయిల్ కంపెనీల సిబ్బంది సహకారంతోనే కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రతి ఏజెన్సీకి రోజుకు ఎన్ని సిలిండర్లు సరఫరా అయ్యాయి, ఎంతమందికి పంపిణీ చేశారు, ఇంకా ఎంతమంది పెండింగ్‌లో ఉన్నారనే వివరాలు ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని వినియోగదారులు కోరుతున్నారు.
గ్యాస్ కొరత భయం… ఇండక్షన్ స్టవ్‌లకు భారీ డిమాండ్
గ్యాస్ సరఫరా ఆలస్యంగా జరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలు ఒక్కసారిగా పెరిగింది. విద్యుత్ కనెక్షన్ ఉంటే వంట చేసుకోవచ్చనే కారణంతో అనేక మంది ఈ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారు.
సాధారణంగా విద్యార్థులు, బ్యాచిలర్లు ఎక్కువగా వినియోగించే ఇండక్షన్ స్టవ్‌లను ప్రస్తుతం కుటుంబాలు కూడా కొనుగోలు చేస్తున్నాయి. దాంతో మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరిగింది.
ఒక దుకాణ యజమాని తెలిపిన వివరాల ప్రకారం, గతంలో రోజుకు ఐదారు స్టవ్‌లు మాత్రమే అమ్ముడయ్యేవి. అయితే ఇటీవల వారంలోనే సుమారు వంద వరకు విక్రయాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలోని చాలా దుకాణాల్లో ఇండక్షన్ స్టవ్‌లు పూర్తిగా అయిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
డిమాండ్ పెరగడంతో కంపెనీలు ధరలను కూడా పెంచాయి. పది రోజుల క్రితం సుమారు రూ.1,000కి లభించిన స్టవ్‌లు ఇప్పుడు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు పెరిగినట్లు సమాచారం. ఆన్‌లైన్ మార్కెట్‌లలో కూడా చాలా మోడళ్లకు స్టాక్ లేకపోవడం వినియోగదారులను మరింత ఇబ్బంది పెడుతోంది.



.jpeg)








