ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: 10వ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పరీక్షల కాలంలో విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించింది.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులను సమయానికి చేరవేయడానికి పోలీసు వాహనాలను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా రవాణా సమస్యలు లేదా ఆలస్యంతో ఇబ్బంది పడే విద్యార్థులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఏలూరు నగరంలోని ప్రధాన కూడళ్లైన ఓల్డ్ బస్టాండ్, ఫైర్ స్టేషన్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసు వాహనాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లడంలో ఆలస్యమైతే లేదా రవాణా సౌకర్యం లభించకపోతే, అక్కడ ఉన్న పోలీసులను సంప్రదించి వాహనాల ద్వారా సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.
అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని విధాల సహాయం అందించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా ఏలూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. పరీక్షా కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైతే పేర్కొన్న ప్రాంతాల్లో ఉన్న పోలీసు వాహనాలను ఆశ్రయించాలని తెలిపారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు.



.jpeg)








