నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి 14: నూజివీడు మండలంలోని తుక్కులూరు సెంటర్ వద్ద రహదారి భద్రతపై నూజివీడు రూరల్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నూజివీడు డీఎస్పీ కె. వి. వి. ఎన్. వి. ప్రసాద్ ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి కేవలం జరిమానా విధించడం కాకుండా వారికి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోతే కలిగే ప్రమాదాలను వివరించి, వారిచేత అక్కడికక్కడే మొత్తం 8 హెల్మెట్లు కొనుగోలు చేయించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ హెల్మెట్ అనేది భారం కాదని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబ బాధ్యతను గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోతున్నారని, వేగాన్ని తగ్గించి భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు తెలిపారు.
కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా వాహనదారుల ప్రాణాలపై శ్రద్ధ చూపుతూ హెల్మెట్లు కొనుగోలు చేయించిన నూజివీడు రూరల్ పోలీసుల ఈ వినూత్న చర్యపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








