ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: ఏలూరులో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు.
టి.టి.డి కల్యాణ మండపం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ తనిఖీలను త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాంబాబు మరియు సిబ్బంది కలిసి నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు కేవలం జరిమానాలు విధించకుండా, అక్కడికక్కడే కౌన్సిలింగ్ నిర్వహించి హెల్మెట్లు కొనుగోలు చేయించి వినూత్నంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని తెలిపారు. హెల్మెట్ అనేది పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికేనని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడి భద్రతపై ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందని, యువత అతివేగం మరియు నిర్లక్ష్యాన్ని విడిచి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కేవలం చలాన్లతో సరిపెట్టకుండా వాహనదారుల ప్రాణ భద్రతపై శ్రద్ధ చూపుతూ వారిలో మార్పు తీసుకువచ్చేలా త్రీ టౌన్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు మరియు వాహనదారులు అభినందించారు.








