తాజా వార్తలు

10/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో పదో తరగతి పరీక్షలు – కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు


జంగారెడ్డిగూడెం, పశ్చిమవాహిని, మార్చి 16: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ శ్రీమతి సుస్మిత ఆర్‌, ఐపీఎస్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.


జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో బందోబస్తు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె విధి నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలు కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎవరూ గుమికూడకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయాల్లో మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు మరియు విధుల్లో ఉన్న అధికారులు తప్ప ఇతరులను, తల్లిదండ్రులను కూడా అనుమతించరాదని తెలిపారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించే సమయంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా అనధికారిక మెటీరియల్ తీసుకురాకుండా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.

అలాగే పరీక్షా కేంద్రం లోపల పోలీసులు నిశ్శబ్దంగా వ్యవహరించాలని, విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. కేంద్రాల బయట వాహనాల హారన్ శబ్దాలు లేదా ఇతర శబ్ద కాలుష్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.

బందోబస్తులో ఉన్న పోలీసులు విధి సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని, తోటి సిబ్బందితో బిగ్గరగా మాట్లాడటం లేదా విద్యార్థులను అనవసరంగా ప్రశ్నిస్తూ ఒత్తిడికి గురి చేయకూడదని హెచ్చరించారు. ఇన్విజిలేషన్‌లో ఉన్న ఉపాధ్యాయులు లేదా ఫ్లయింగ్ స్క్వాడ్ కోరితే తప్ప పరీక్షా గదుల్లోకి ప్రవేశించరాదని స్పష్టం చేశారు.

పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని, వారు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా పోలీసులు రక్షణ కవచంలా నిలవాలని ఏఎస్పీ సుస్మిత ఆర్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాస్, ఎస్ఐ వీరప్రసాద్తో పాటు పరీక్షా బందోబస్తుకు కేటాయించిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.