తాజా వార్తలు

10/recent/ticker-posts

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి – ఏలూరు పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహనీయుల జీవితాన్ని స్మరించుకోవడం అనేది కేవలం చరిత్రను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా నేటి సమాజానికి అవసరమైన విలువలను కూడా గుర్తు చేసుకోవడమేనని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధ్యమైందని, ఆయన త్యాగం నేటి తరాలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

భాషా స్వాభిమానాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952లో ఆయన చేపట్టిన నిరాహార దీక్ష దాదాపు 58 రోజుల పాటు కొనసాగి చరిత్రలో ఒక గొప్ప త్యాగంగా నిలిచిందని తెలిపారు.

1901 మార్చి 16న జన్మించిన పొట్టి శ్రీరాములు, మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలు రాజకీయంగా, పరిపాలనా పరంగా నష్టపోతున్నారని భావించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవసరమని నమ్మారు. తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు ఆయన 1952లో ప్రారంభించిన నిరాహార దీక్ష 58 రోజులపాటు కొనసాగి, చివరకు 1952 డిసెంబర్ 15న ఆయన అమరత్వాన్ని పొందారు. ఆయన త్యాగ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

సమాజంలో మార్పు కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అరుదైన మహనీయుల్లో పొట్టి శ్రీరాములు ఒకరని, ఆయన జీవితం త్యాగం, అంకితభావం, సామాజిక న్యాయం కోసం సాగిన గొప్ప ప్రయాణమని ఎస్పీ పేర్కొన్నారు. అందుకే ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్‌ఐ పవన్ కుమార్, పోలీస్ ప్రధాన కార్యాలయం ఏఓ షేక్ మస్తాన్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.