నిడదవోలు, పశ్చిమ వాహిని, మార్చి 14: నిడదవోలు పట్టణంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఆసుపత్రిలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని వైద్యులు, సిబ్బందితో ఆరోగ్య సేవల మెరుగుదలపై చర్చించారు.
అనంతరం ఆసుపత్రి వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల పనితీరు, మందుల నిల్వలను పరిశీలించిన మంత్రి అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అధికారులకు సూచనలు చేశారు. వైద్య వృత్తి మానవతా సేవతో కూడినదని, వైద్యులు సేవాభావంతో పని చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి దుర్గేష్ తెలిపారు.
అనంతరం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









