తాజా వార్తలు

10/recent/ticker-posts

ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందన – అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన తాటి వెంకటేశ్వర్లు


దమ్మపేట, పశ్చిమ వాహిని, మార్చి 14: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గడుగులపల్లి గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. 


అనంతరం పాఠశాల భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు అందజేస్తున్న నిత్యవసర సరుకులను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని, వారిని కన్నబిడ్డల మాదిరిగా చూసుకోవాలని వార్డెన్ మరియు మిడ్‌డే మీల్స్ సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో జరుగుతున్న ఘటనలు సంక్షేమ హాస్టళ్ల దుస్థితిని చూపిస్తున్నాయని విమర్శించారు. గత కొద్ది నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 పాఠశాలల్లో 127 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కూడా దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, విద్యార్థుల ప్రాణాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన విమర్శించారు.