తాజా వార్తలు

10/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో 62వ ఉగాది జాతర మహోత్సవాలు ఆదివారం ప్రారంభం


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, మార్చి 14: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 62వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 15న ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలను ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహిస్తున్నారు. 

ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) మాట్లాడుతూ ఉగాది జాతరను టీటీడీ వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వార్షిక పండితులు, ఉపన్యాస వాచస్పతి “శైవాగమ విశారద” బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్య సుబ్రహ్మణ్య శర్మ చేత ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే వీరంపాలెం శ్రీ బాలా త్రిపురసుందరీ పీఠం ఆధ్యాత్మిక వేత్త ఈమని శశికుమార్ శర్మ అమ్మవారి విశిష్టత గురించి భక్తులకు వివరించారు.


జాతర ప్రారంభ సందర్భంగా ఉదయం 9 గంటలకు గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆనవాయితీగా చీర సారే పట్టు వస్త్రాలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. 1008 మంది సుమంగళులు పాల్గొనే ఈ శోభాయాత్రలో మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పాలపొంగళ్ళు (బోనాలు), పుణ్యనదీ జలాలతో సహస్ర కలశాలు మరియు గరగాటలతో భారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు ఆదివారం ఉదయం 9 గంటలకు గంగానమ్మ ఆలయం వద్దకు రావాలని నిర్వాహకులు కోరారు.

ఉత్సవాల నిర్వహణలో భాగంగా అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు ముళ్ళపూడి వీర రాఘవులు–నాగమణి దంపతులు, వల్లభనేని సురేంద్ర–కీర్తి దంపతులు, అప్పసాని వెంకటరామారావు–నాగరాజేశ్వరి దంపతులు, విద్యా వికాస్ విద్యాసంస్థలు తలా రూ.5,000 చొప్పున విరాళాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలుపర్తి రాము, మండవల్లి రాంబాబు, భీమిరెడ్డి జోగిబాబు, పైల చంటి, చింతకాయల అచ్చిరాజు తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.