తాజా వార్తలు

10/recent/ticker-posts

తుక్కులూరు సెంటర్‌లో వినూత్న తనిఖీలు – స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌, హెల్మెట్‌పై అవగాహన


తుక్కులూరు సెంటర్‌, పశ్చిమవాహిని, మార్చి 16: విద్యార్థుల భద్రత మరియు రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు తుక్కులూరు సెంటర్‌లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీకె. వి. వి. ఎన్. వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు.


రూరల్ ఇన్‌స్పెక్టర్కె. రామకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు), ఎస్‌ఐలు జ్యోతి బాసు, లక్ష్మణ్ బాబు బృందం కలిసి స్కూల్ బస్సులను నిలిపి వాటి ఫిట్‌నెస్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను స్కూల్ బస్సుల్లో పంపుతారని, ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత డ్రైవర్లు మరియు యాజమాన్యాలపై ఉందని సూచించారు. బస్సులను ఎప్పటికప్పుడు మెకానికల్ కండిషన్‌లో ఉంచుకోవాలని, ముఖ్యంగా బ్రేకులు, టైర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను తరచుగా తనిఖీ చేయాలని సూచించారు.

డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని, ఈ విషయంలో యాజమాన్యాలు కూడా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులు హెచ్చరించారు.

హెల్మెట్‌పై అవగాహన..
ఈ తనిఖీల్లో భాగంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పోలీసులు మానవీయ కోణంలో అవగాహన కల్పించారు. చలాన్లు విధించడం మాత్రమే కాకుండా, వారికి అక్కడికక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి హెల్మెట్లు కొనుగోలు చేయించారు.

“హెల్మెట్ తలపై భారం కాదు… అది మీ ప్రాణానికి రక్షణ కవచం” అని ఎస్‌ఐలు జ్యోతి బాసు, లక్ష్మణ్ బాబు వాహనదారులకు వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు.

ఇంట్లో తమ కోసం ఎదురుచూస్తున్న భార్యా పిల్లలు, తల్లిదండ్రులను గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటోందని, అతి వేగాన్ని తగ్గించి రక్షణ కవచమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

జరిమానాలు విధించడం కంటే బాధ్యతను గుర్తు చేస్తూ హెల్మెట్లు కొనుగోలు చేయించిన పోలీసుల తీరుపై స్థానికులు, వాహనదారులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు రూరల్ పోలీసు సిబ్బంది మరియు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.