ముసునూరు, పశ్చిమవాహిని, మార్చి 16: రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముసునూరులో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. “వేగం వద్దు… ప్రాణం ముద్దు” అనే నినాదంతో వాహనదారులకు భద్రతా సూచనలు ఇచ్చారు.
నూజివీడు డీఎస్పీకె. వి. వి. ఎన్. వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రూరల్ సీఐకె. రామకృష్ణ ఆధ్వర్యంలో ముసునూరు ఎస్ఐ ఎం. చిరంజీవి మరియు పోలీసు సిబ్బంది కలిసి సోమవారం విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.
ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతతో పాటు సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా రక్షణ పొందేందుకు ఇది అత్యంత అవసరమని తెలిపారు.
అలాగే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలపకుండా నిర్ణీత ఆటో స్టాండ్లలోనే నిలపాలని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేయిస్తే వారి తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఇండియా సేవలను వినియోగించుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకుని సురక్షితంగా ప్రయాణించాలని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే విజిబుల్ పోలీసింగ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.



.jpeg)








