ముసునూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: ముసునూరు మండలంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎం. చిరంజీవి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి వాహనదారులకు హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం కె. వి. వి. ఎన్. వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, కె. రామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
అదే విధంగా ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలపకుండా ఆటో స్టాండ్‌లలోనే పార్క్ చేయాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకుని సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే ఈ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.








