తాజా వార్తలు

10/recent/ticker-posts

జాతీయ లోక్ అదాలత్‌లో 8,815 కేసులు పరిష్కారం – సమయం, డబ్బు ఆదా అవుతాయి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: ఏలూరులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,815 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని, ఇరుపక్షాలు చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలుగుతారని తెలిపారు. కేసుల పరిష్కారంలో ఏర్పడే జాప్యాన్ని తగ్గించేందుకు జాతీయ లోక్ అదాలత్ సులభమైన, ఉత్తమమైన మార్గమని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 111 ప్రీ లిటిగేషన్ కేసులు, 147 మోటారు వాహన ప్రమాద భీమా కేసులు, 166 సివిల్ కేసులు, 94 చెక్ బౌన్స్ కేసులు, 36 కుటుంబ వివాదాల కేసులు, 8,261 క్రిమినల్ మరియు ఇతర కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడినట్లు తెలిపారు. మోటారు వాహన ప్రమాద భీమా కేసుల్లో రూ.6 కోట్లకు పైగా పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి యు. ఇందిరా ప్రియదర్శిని, ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్. మురళీకృష్ణ, ఏడవ అదనపు జిల్లా జడ్జి వై. శ్రీనివాసరావు, ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఐ. శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాదు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొనే సీతారాం, పీపీ ఏ.వి. నారాయణ, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యులు తమ్మినేని విజయకుమార్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.