తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉపాధి హామీ కూలీల వేతనాలు చెల్లించాలి – సీపీఐ డిమాండ్


టి. నరసాపురం, పశ్చిమవాహిని, మార్చి 17: మండలంలోని అల్లంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి తడిగడప జయరాజు డిమాండ్ చేశారు.


ఈ మేరకు టి. నరసాపురం మండల ఉపాధి హామీ పథకం ఏపీఓకు ఆయన వినతి పత్రం అందజేశారు. కొత్తగూడెం గ్రామానికి చెందిన పేద వ్యవసాయ కూలీలు పూర్తిగా ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పనులకు వెళ్తున్న కూలీలకు ఆన్‌లైన్ హాజరు నమోదు సమయంలో ఆధార్ ఫేస్ ఫోటో క్యాప్చర్, బయోమెట్రిక్ వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

ఎండనక వాననక కష్టపడి పని చేసినప్పటికీ సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత ఆరు వారాలుగా చేసిన పనులకు సంబంధించిన వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదని పేర్కొన్నారు. దీంతో కూలీల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పూట గడవక ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు.

ఫోటో క్యాప్చర్, వేలిముద్రల నమోదు సమస్యలను వెంటనే పరిష్కరించి, జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పించాలని ఆయన కోరారు. అలాగే ఆరు వారాలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

పేద కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు హెచ్చరించారు.