తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక – 46 ఫిర్యాదులు స్వీకరణ


ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘ప్రజల సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎస్పీతో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను విన్నారు.

ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, పారదర్శకమైన ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. ఈరోజు మొత్తం 46 ఫిర్యాదులు అందగా, వాటిలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, అందిన ఫిర్యాదులపై చట్టపరంగా వెంటనే విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం తప్పనిసరిగా జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు. సమీపంలోని సబ్‌డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు. అలాగే ఫిర్యాదులు చేయాలనుకునే వారు మీకోసం పోర్టల్ meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ప్రజలు చేసిన ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్‌ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని అధికారులు వివరించారు.

అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల కోసం శ్రి సత్య సై బాబా ట్రస్ట్ తరఫున ఉచిత భోజన సదుపాయం కల్పించారు.