భీమడోలు/ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏలూరు జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీకె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు పోలీస్ అధికారులు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
మార్చి 16న భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ, భీమడోలు ఎస్ఐ మదీనా భాషా, ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్ మరియు పోలీసు సిబ్బంది కలిసి జాతీయ రహదారి 16 పరిధిలోని ఎం. నాగులపల్లి గ్రామం వద్ద రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు. మొత్తం 120 మంది వాహనదారులు హెల్మెట్లు కొనుగోలు చేసి ధరించారు.
పోలీసులు మాట్లాడుతూ, “హెల్మెట్ భారం కాదు… ప్రాణానికి రక్షణ కవచం” అని తెలిపారు. తలరాతను మార్చలేకపోయినా, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. అలాగే ఇంట్లో తమ కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులను కోరారు.
హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనాలు..
రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాల నుంచి రక్షణ
గాలి, ధూళి, పురుగులు కంట్లో పడకుండా కంటి రక్షణ
ఎండ, వాన, చలి నుంచి తలకు రక్షణ
బయటి శబ్దాలు తగ్గి డ్రైవింగ్‌పై ఏకాగ్రత పెరుగుతుంది
ట్రాఫిక్ జరిమానాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది
హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా ISI మార్క్ ఉన్న హెల్మెట్నే ఉపయోగించాలని అధికారులు సూచించారు. కేవలం జరిమానా తప్పించుకోవడానికి కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ, “మీ తల మీ కుటుంబానికి అమూల్యమైన ఆస్తి… దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి” అని వాహనదారులకు సూచించారు.



.jpeg)








