చింతలపూడి, పశ్చిమ వాహిని, మార్చి 14: CFVVచింతలపూడిలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 450 కేసులు పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ జడ్జి సి.హెచ్. మధు బాబు తెలిపారు. కోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ప్రజలు లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా క్రిమినల్, సివిల్, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్, బీఎస్‌ఎన్‌ఎల్ రికవరీ, కుటుంబ తగాదాలు, మనోవర్తి, ప్రామిసరీ నోట్ వంటి పలు కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే చింతలపూడి ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌కు సంబంధించిన కేసుల్లో రూ.81,440 వసూలు చేయగా, ఇతర కేసుల రికవరీ కలిపి మొత్తం రూ.50,36,496 అపరాధ రుసుమును చలానా ద్వారా ప్రభుత్వ ఖజానాకు చెల్లించి కేసులను కాంపౌండ్ చేసినట్లు వివరించారు.
రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయని, కోర్టులో ప్రతి రోజు ఉచిత లోక్ అదాలత్ సెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. మాణిక్యాలరావు, అడ్వకేట్ బి. నాగేశ్వరరావు, పోలీసులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.








