ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 14: ఏలూరులో మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 24,019 మంది విద్యార్థుల కోసం 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఓపెన్ స్కూల్ (APOSS) పరీక్షలకు 803 మంది విద్యార్థుల కోసం 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతి విద్యార్థి పరీక్షా సమయానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, మాస్ కాపీయింగ్ లేదా ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన 8 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏవైనా సమస్యలు ఉంటే 9491395377 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సులభంగా చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 31 స్టోరేజ్ పాయింట్లు, 133 చీఫ్ సూపరింటెండెంట్లు, 133 డిపార్ట్‌మెంట్ అధికారులు, 2 అదనపు అధికారులు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 20 రూట్ ఆఫీసర్లు నియమించామని వివరించారు.
ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్ ఆర్. ఆశ మరియు జిల్లా విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.








