ఏలూరు, పశ్చిమవాహిని, మార్చి 16: జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
సోమవారం ఏలూరులోని పవర్‌పేట అన్నే భవన్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. మహాసభల సందర్భంగా జూన్ 3న వేలాది మంది రైతులతో భారీ రైతు ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు రోజులపాటు సుమారు 500 మంది రైతు ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరుగుతుందని వివరించారు.
మహాసభల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడతామని, జిల్లాలోని వివిధ పంటల రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ సమస్యలపై సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార జాతాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతు ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఏలూరులో జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతాంగాన్ని కోరారు.
అమెరికా సామ్రాజ్యవాదం కొనసాగిస్తున్న యుద్ధాల ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల రాష్ట్రంలోని పలు పంటల రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు పంటల ధరలను తగ్గిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఆక్వా, మామిడి, మొక్కజొన్న, కోకో, పొగాకు, అరటి వంటి పంటల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని అమలు చేసి అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారుల పేరుతో రాష్ట్రంలో లక్షల ఎకరాల రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాట కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మించాలని, అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా ఆగిరిపల్లి మండలంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, సీనియర్ నాయకుడు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు సిరిబత్తుల సీతారామయ్య, సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు గుండపనేని సురేష్, గుర్రం రాంబాబు, వెలగలేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.



.jpeg)








