ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు జరగనున్న “శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం” ఏర్పాట్లకు సంబంధించిన సమన్వయ సమావేశం గురువారం నిర్వహించబడింది. జాతర మహోత్సవ కమిటీ చైర్మన్, ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి డా. అచ్యుత అంబరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి డా. ఘంటసాల వెంకటలక్ష్మి ముఖ్యంగా పాల్గొన్నారు. జాతర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, భక్తులకు అందించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను డా. ఘంటసాల వెంకటలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం ఆమె శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జల్లూరి వెంకన్న బాబు ఆమెకు ఆలయ మర్యాదలతో సత్కారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేశారు.
జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు.







