ఏలూరు/దెందులూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పుట్టినరోజు సందర్భంగా నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి నోటిమూలంగా ఎమ్మెల్యే చంటి ఆయురారోగ్యాలతో ఉండాలని మంగళశాసనం చేయించారు.
రైతులు సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న చిన్న జీయర్ స్వామివారిని ఎస్ఎంఆర్ పెదబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి జిల్లా ప్రజలకు, రైతులకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ మరింత ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
“సుఫల రైతు పాదయాత్ర” పేరుతో కొనసాగుతున్న ఈ యాత్ర వంగూరు, గార్లమడుగు, లక్ష్మీపురం, దిబ్బగూడెం తదితర ప్రాంతాల్లో కొనసాగుతోంది. వంగూరు సమీపంలో చిన్న జీయర్ స్వామివారిని ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్లతో కలిసి కలుసుకుని పండ్లు, పూలమాల సమర్పించి ఆశీస్సులు పొందారు.
రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని, రైతులందరూ క్షేమంగా ఉండాలని చిన్న జీయర్ స్వామివారు చేస్తున్న పాదయాత్రకు రైతుల నుండి విస్తృత మద్దతు లభించిందని పెదబాబు పేర్కొన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, రైతులు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ముందంజలో నిలపాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం నెరవేరాలని చిన్న జీయర్ స్వామివారి ద్వారా శ్రీమన్నారాయణుని ప్రార్థించి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి నాగబాబు, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.







