నెల్లూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీలో ఇటీవల ఓ బాలిక మృతి ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి కాకాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో పోలీసులు ఆయనను విచారణకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో గత నెల ఓ బాలిక మృతిచెందింది. చిన్నారి చికిత్సలో భాగంగా కోవూరు CHC, నెల్లూరు ACSR ప్రభుత్వ ఆసుపత్రి, చెన్నై స్టాన్లీ హాస్పిటల్‌లో చికిత్సపొందినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్థానికంగా వివిధ ఆరోపణలు, ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన తర్వాత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ ఘటనను ప్రస్తావిస్తూ బాలిక, తల్లిదండ్రుల గుర్తింపును ప్రస్తావించారు. దీంతో కాకాణి.. ప్రజలను రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. గంజాయి మాఫియా, గ్యాంగ్ రేప్ వంటి నిరాధార ఆరోపణలు కాకాణి చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో, స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ నేత మల్లారెడ్డి.. కాకాణి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసు ప్రకారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈనెల 14న ఉదయం 11 గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఘటనపై వివరణలు, వ్యాఖ్యల నేపథ్యం, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఘటన ఆంధ్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. వైసీపీ వర్గాలు ఇది కక్షపూరిత చర్యని ఆరోపిస్తుంటే, అధికారపక్షం చట్టపరమైన చర్యలు తప్పనిసరి అంటున్నాయి. ఈ విషయంపై స్వతంత్రంగా విచారణ చేసి, నిజాలను వెలికితీయాలని స్థానికులు, రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.






