న్యూఢిల్లీ, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: తెలంగాణలో తానే రాజు తానే మంత్రినని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ పోల్చుకోనని.. తనకు ఎవరూ పోటీ కారన్నారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 2029లో జమిలి ఎన్నికలు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు.
ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వడంపై తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో.. అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరామన్నారు. కానీ ఈ అంశాన్ని కేంద్రం పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. ఈ అంశంలో సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మూడు పిల్లర్లు మాత్రమే కూలాయని చెప్పడం పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్ట్ లోపల బాంబు పెడితే పైన పేలుతుంది.. కింద కూలదని స్పష్టం చేశారు. మూడు పిల్లర్లా?.. ముప్పయ్ పిల్లర్లా? అనేది కమిటీ నిర్ధారించిన తర్వాత చెబుతామని చెప్పారు. కృష్ణా జలాలపై తాము అడిగినవన్నీ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కి సైతం సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కవిత పార్టీ గురించి తమకు తెలియదన్నారు.
ఎన్టీఆర్ జాతీయ నాయకుడు.. ఆయన ఏ ఒక్కరికి సొత్తు కాదని.. జాతీయ సొత్తు అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంతా మూర్ఖులు ఎవరు ఉండరన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడని పునరుద్ఘాటించారు. కాళేశ్వరంపై 48 గంటల్లో విచారణ చేయిస్తామని కిషన్ రెడ్డి గతంలో ప్రకటించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదంటూ కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరంపై తాము నేరుగా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశామని వివరించారు.
జడ్జీలు, జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్లు సైతం ట్యాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కారకుడు ప్రభాకర్‌రావు 20 నెలలపాటు విదేశాలకు పారిపోయారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును స్వదేశానికి తీసుకొచ్చామని వివరించారు.
ప్రభాకర్‌రావు విచారణ తర్వాతే ఒక్కొక్కరికి సిట్ నోటీసులు జారీ చేస్తోందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎస్ఐబీలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు.. సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.







