తాజా వార్తలు

10/recent/ticker-posts

బీసీలపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఖండనీయం


భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు


అమరావతి / ఏపీ భవన్, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం వారిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు తీవ్రంగా విమర్శించారు. ఏపీ భవన్‌లో బిసి నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తిరుపతి ఈవోగా బిసి సామాజిక వర్గానికి చెందిన ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బీసీల సామాజిక స్థాయిని తగ్గించేలా మాట్లాడడం వారి చులకన భావాన్ని బయటపెడుతోందని విమర్శించారు.

అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి, ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరింత దుర్మార్గమని దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగడం రాజకీయ అసహనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

బీసీల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను అవమానించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు బిసి నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.