తాజా వార్తలు

10/recent/ticker-posts

విద్యుత్ కనెక్షన్ పేరుతో రైతుకు మోసం? రూ.60 వేల లంచం ఆరోపణలు – చింతలపూడి విద్యుత్ శాఖపై తీవ్ర విమర్శలు


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, చింతలపూడి 11: విద్యుత్ కనెక్షన్ పేరుతో రైతులను వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యుత్ శాఖలో పనిచేసే కొందరు సిబ్బంది ముఠాగా ఏర్పడి రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన అలాగాని రామకోటయ్య అనే రైతు తన ఆవేదనను మీడియా ముందుంచారు.

రామకోటయ్య తన పొలానికి కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అధికారికంగా సుమారు రూ.19,000 డీడీ తీసుకోవాల్సి ఉండగా, చింతలపూడి విద్యుత్ శాఖ ఏఈ రూ.60,000 డిమాండ్ చేసి తీసుకున్నారని ఆరోపించారు. “కొత్త కనెక్షన్, లైన్ ఏర్పాటు మొత్తం మేమే చూసుకుంటాం” అంటూ డబ్బులు వసూలు చేశారని వాపోయారు.

2023 జూన్ నెలలో రూ.60 వేల రూపాయలు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయలేదని రైతు ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా కార్యాలయాల చుట్టూ వందలసార్లు తిరిగినా తన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, హడావుడిగా రూ.10,000 రైతు పేరిట డీడీ తీసినట్లు సమాచారం. అయితే మిగతా డబ్బుల వివరాలపై స్పష్టత లేదని రైతు అంటున్నారు.

చింతలపూడి విద్యుత్ శాఖలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగాని రామకోటయ్య మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపడతారా? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.