తాజా వార్తలు

10/recent/ticker-posts

చింతలపూడిలో నగరవనం నిర్మాణానికి శ్రీకారం – వర్చువల్ జంగిల్ సఫారీతో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్ట్


చింతలపూడి, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదాన్ని అందించేందుకు చింతలపూడి పట్టణ శివారు ఫాతిమాపురంలో నగరవనం నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రాంత అభివృద్ధికి మరో అడుగుగా నిలవనుంది.


మంగళవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్, అటవీశాఖ అధికారి (DFO) సందీప్ రెడ్డితో కలిసి నగరవనం కోసం కేటాయించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమగ్రంగా చర్చించి అవసరమైన సూచనలు చేశారు.

నగరవనం ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా ఉండేలా ప్రత్యేక రూపకల్పన చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు వినోదంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దాలని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా నగరవనంలో వర్చువల్ జంగిల్ సఫారీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి శోభను ప్రతిబింబించేలా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దడంతో పాటు సందర్శకులకు క్రికెట్ టర్ఫ్, క్రీడా మైదానం, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

పిల్లలు, పెద్దలు అందరూ ఆకర్షితులయ్యే విధంగా వినూత్న రూపకల్పనతో నగరవనాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆకాంక్షించారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత చింతలపూడి ప్రాంతానికి కొత్త పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.