కైకలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కైకలూరులో నిరసన ప్రదర్శన, రాస్తారోకో, ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు.
కార్మిక, కర్షక ఐక్యత వర్ధిల్లాలని,కార్మిక హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ముందుగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు పోలవరపు సుజాత అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని చెప్పారు. పని గంటలు పెంపు, యూనియన్ రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు, కనీస వేతనాలు అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అనేక ప్రమాదకర అంశాలు లేబర్ కోడ్స్ లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికు వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడి,ఆశ, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి, రిటైర్డ్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానం తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆటో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని, ఉపాధి గ్యారెంటీ కల్పించాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయాలన్నారు.
అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. అన్ని రకాల పంటల రైతులు, పాడి రైతులు నష్టపోతారన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలన్నారు. వి బి జి రామ్ జి పథకం రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ హక్కు చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలన్నారు.
రైతు వ్యతిరేక విత్తన చట్టం, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోరుతున్న మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్.మీనా కుమారి, బి.వి సత్యవతి, ఝాన్సీ రాణి, ఎ. విజిత, నాగజ్యోతి, నాగమణి,కె.ధనలక్ష్మి, పి. ప్రమీల, దేబోరా, సుధాకర్,ఇజ్రాయిల్, శేఖర్,ఆమోస్, యేసు రాజు తదితరులు పాల్గొన్నారు.







