తాజా వార్తలు

10/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో సార్వత్రిక సమ్మె ఘనవిజయం – 4 లేబర్ కోడ్ల రద్దుకు గళమెత్తిన కార్మిక సంఘాలు


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలో సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది. ఏలూరు రోడ్‌లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించగా, వందలాది మంది కార్మికులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.


సభకు ముందు పాత పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి భారీ ప్రదర్శన చేపట్టారు. రామాలయం, గంగానమ్మ గుడి, బోసు బొమ్మ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరింది. నినాదాలతో పట్టణం మార్మోగింది.

ఈ బహిరంగ సభకు ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, సీఐటీయూ మండల కార్యదర్శి పసల సూర్యరావు, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు జంపన వెంకటరమణరాజు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. రవి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్, ఏఐటీయూసీ నాయకుడు కుంచే వసంతరావు, టీయూసీఐ నాయకుడు జోన్నకూటి వెంకటేశ్వరరావు, చంద్రన్న వర్గం ప్రతినిధులు, ఐఎఫ్‌టీయూ నాయకుడు సాలి రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.

వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గ హక్కులను హరించడానికే ఉద్దేశించబడినవని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు చట్టబద్ధ హక్కులు లేకుండా చేసే విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

లక్షల కోట్ల రూపాయల రాయితీలు కార్పొరేట్ సంస్థలకు ఇస్తూ, శ్రామిక వర్గానికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. అంగన్వాడి, ఆశా, మిడ్డే మిల్స్ వంటి స్కీం రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో మోటార్, హమాలీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి సంక్షేమ బోర్డుల ద్వారా ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.

2025 జీ-రాంజీ ఉపాధి హామీ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పాత ఉపాధి హామీ పథకంలో 90% నిధులను కేంద్రం భరించగా, ఇప్పుడు 40% నిధులను రాష్ట్రాలపై మోపడం పథకాన్ని ఎత్తివేయడానికే ప్రయత్నమని అన్నారు. కరువు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలు ఈ భారం ఎలా భరించగలవని ప్రశ్నించారు. పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ సభను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కునపాముల విజ్ఞేశ్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు గంటా విమల, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శిరోమణి, మార్కెట్ యార్డ్ యూనియన్ నాయకులు గంపల వెంకటేష్ తదితరులు ఉద్దేశించి ప్రసంగించారు.

కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చల్లారి మాణిక్యాలరావు, పీడీఎస్యూల జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మానుకొండ జీవరత్నం, వంగా గోపి, ఎస్‌కే మాబూ సుభాని, ఏఐటీయూసీ నాయకులు బాలయేసు, సుంకర రాధాకృష్ణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడు కరకల ప్రతాప్, ఐఎఫ్‌టీయూ నాయకులు యాదాల వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి బోజ్జయ్య, షేక్ బాజీ, పొడిదోలు దుర్గారావు, అంగన్వాడి వర్కర్స్ నాయకులు కలపాల శిరోమణి, ఎం. లక్ష్మీదేవి, కే. సత్యవేణి, ఆశా వర్కర్స్ నాయకులు కే. నాగమణి, జి. నాగదుర్గ, ఏ. రజిని, ఏ. జ్యోతి, వి. శిరోమణి, టి. అరుణ, ఆటో యూనియన్ నాయకుడు ఆశీర్వాదం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి. బాలరాజు, మడకం రామన్న తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు విశేష స్పందన లభించిందని, కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించేవరకు పోరాటాలు కొనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు.