ఏలూరు/ఢిల్లీ, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: రాష్ట్రాలలో అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునికరణ అవసరాన్ని గుర్తించి 15వ ఆర్థిక సంఘం 5 వేల కోట్ల కేటాయింపులకు సిఫార్సు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. దేశంలో అగ్ని ప్రమాదాలు, వాటి నివారణకు ఏర్పరచిన అగ్నిమాపక భద్రత నిబంధనలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంగళవారం లోక్ సభలో కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన వివరాల ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండ్ (NCRB) రూపొందించిన డేటా ప్రకారం 2023 ఒక్క ఏడాదిలోనే హైదరాబాదులోనే దేశంలో మొత్తం 7,054 అగ్నిప్రమాదాలు నమోదవ్వగా 6,891 మంది మరణించారు, 284 మంది గాయపడ్డారు. అయితే, అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతాచార్యలు అనేవి పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని, విధానపరమైన విషయాలలో సలహాలు, మద్దతు ఇవ్వడం వరకే కేంద్ర ప్రభుత్వం పాత్ర పోషిస్తుందని అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తుగా తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక యూనిట్లలో అగ్నిమాపక భద్రత నిబంధనలపై జరిగిన సమీక్ష వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ 2016లో "నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (NBC)"ని ప్రచురించిందని చెప్పిన మంత్రి ఇందులో భవనాలలో పొగ నిర్వహణ, విద్యుత్తు, అగ్ని ప్రమాద నివారణ సామగ్రి, భవన నిర్వహణ వ్యవస్థ, సెన్సార్లకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రక్షణ కోసం నిబంధనలను ప్రమాణాలను స్పష్టంగా ఇందులో సూచించినట్లు తెలిపారు. అంతేకాకుండా నాగపూర్ లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ (NFSC)లో సబ్ ఫైర్ ఆఫీసర్లు, స్టేషన్ ఆఫీసర్లు మరియు డివిజనల్ ఆఫీసర్లకు అగ్నిమాపక రక్షణలో ఆధునిక పద్ధతులపై క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. నాగపూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఫైర్ ఇంజనీరింగ్ సైన్స్ లో నాలుగు సంవత్సరాల బీటెక్ డిగ్రీ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గత ఐదు సంవత్సరాల్లో NFSC నాగపూర్ లో మొత్తం 4,049 ఫైర్ సర్వీస్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు, 329 బిటెక్ ఇంజనీర్లు ఇక్కడినుంచి తయారైనట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిమాపక సేవలు విస్తరణ మరియు ఆధునీకరణ కోసం ఒక పథకాన్ని కూడా ప్రారంభించినట్లు చెప్పిన కేంద్ర మంత్రి ఈ పథకంలో కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు, రాష్ట్ర శిక్షణా కేంద్రాల బలోపేతం, అగ్నిమాపక కేంద్రాలలో సాంకేతికత అప్ గ్రేడ్ చేయడం వంటి అంశాలు ఉన్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి తెలియచేశారు.







