ఏలూరు జిల్లా చింతలపూడి: మండలం చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు.
అందులో భాగంగానే గతంలో డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించే చర్యగా అభివర్ణించారు.
2014–19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అనంతరం 2019–24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అధిక రేట్లతో విద్యుత్ కొనుగోలు చేసి, నియంత్రణ లేకుండా వినియోగం పెంచి విద్యుత్ రంగాన్ని నష్టాలపాలు చేసిందని విమర్శించారు. ఆ కాలంలో దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలను తీవ్రంగా పీడించారని అన్నారు.
2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ క్రమంలో డిస్కంలకు చెల్లించాల్సిన సుమారు రూ.4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీలను ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో పాటు యూనిట్ ఛార్జీల తగ్గింపుపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. ఒకవైపు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గిస్తూ, మరోవైపు వినియోగదారులపై ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచే ప్రభుత్వమేం కాదని, ప్రజల మేలు కోసం చార్జీలను తగ్గించే ప్రభుత్వమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.







