తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం/సీతానగరం/కోరుకొండ: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు భరోసా కల్పించేలా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఉన్న తన స్వగృహం వద్ద 109 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.83,04,036/- విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులు, ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారితో పాటు జనసేన పార్టీ ‘నా సేన కోసం నా వంతు’ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని లబ్ధిదారులను ఆత్మీయంగా పరామర్శించారు. అనారోగ్య సమయంలో ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సీతానగరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు ఈ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది. చినకొండేపూడి, ఇనుగంటివారిపేట, కాటవరం, మునికూడలి, నాగంపల్లి, పురుషోత్తపట్నం, రఘుదేవపురం, రాపాక, సీతానగరం, సింగవరం, ఉండేశ్వరపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఈ సహాయాన్ని పొందారు. ఒక్కొక్కరికి వారి వైద్య అవసరాల ఆధారంగా వివిధ మొత్తాల్లో చెక్కులు మంజూరు చేయబడ్డాయి.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా తనవంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు తెలిపారు. ఇలాంటి సహాయక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







