Hot Posts

6/recent/ticker-posts

కూటమి ప్రభుత్వంలోనే దళిత సామాజిక వర్గాలకు మనుగడ


వైసీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు
దివంగత డాక్టర్ సుధాకర్ కుమారునికి పదోన్నతి పట్ల దళిత సంఘాల హర్షం 


రామచంద్రపురం: గత వైసిపి ఐదేళ్ల పాలనలో దళిత సామాజిక వర్గాలపై విపరీతంగా దాడులు పెరిగాయని, దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం దళితుల పక్షాన అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుందని ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ, దళిత సంఘాల నేతలు కాటే సుబ్రమణ్యం, చిల్లా గోపాలకృష్ణ, ఏడుకొండలు, కనికెళ్ల సత్తిబాబు, పోతురాజు భీమారావు  తదితరులు పేర్కొన్నారు. 

సోమవారం స్థానిక ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో  దళితుల సంక్షేమం గాలికి వదిలేసారని, దళితుల కోసం నిర్దేశించిన  27 సంక్షేమ పథకాలు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వైద్యులకు మాస్కులు అడిగినందుకు నర్సీపట్నం పీహెచ్ సిలో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ ను రెండు చేతులు వెనకకు కట్టి, బట్టలు ఊడదీసి పోలీస్ లు లాఠీలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ ఎస్సీలను చిన్నచూపు చూస్తూ అవమానించారని, ఆ అవమాన భారంతో డాక్టర్ సుధాకర్  గుండెపోటుతో మరణించారని ఉదహరించారు. 

జగన్ పాలనలో ఎస్సీలను అనుగదొక్కడానికే  సరిపోయిందని, దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచి ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసిల్దారుగా పదోన్నతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు దళిత సామాజిక వర్గానికి చెందిన తన డ్రైవర్ను కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినా అడిగే నాథుడు లేకుండా పోయాడని విమర్శించారు. ఈ సంఘటనలే వైసిపి రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు.  

అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును రీ ఓపెన్ చేసి  పూర్తి దర్యాప్తు చేస్తామని, డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. అలాగే హత్యకు గురైన వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత సామాజిక  కుటుంబానికి నష్టపరహారం అందించి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. వైసీపీ పాలనలో దళిత వర్గాలను అనగతొక్కారని,  వైసీపీ రద్దు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పునరుద్ధరించి దళితుల పక్షపాతిగా నిలిచింద న్నారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే  ధ్యేయంగా ప్రజా రంజక పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దళిత సామాజిక వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ బాసటగా నిలిచి కూటమి ప్రభుత్వానికి  సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కనికెళ్ల సత్తిబాబు, కాటే సంజీవ్, వినకోటి అప్పారావు, బత్తుల భైరవ స్వామి, ఉండ్రు భాస్కరరావు, కే శ్రీను తదితరులు పాల్గొన్నారు.