తాజా వార్తలు

10/recent/ticker-posts

ఉత్సాహంగా ప్రారంభమైన ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్ – 2026.. ఐక్యతకు వేదికగా ప్రజాప్రతినిధుల క్రీడలు


విజయవాడ, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా ఉత్సవాలు–2026 మంగళవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి, స్పోర్ట్స్ ఫ్లాగ్, జాతీయ పతాకం, అసెంబ్లీ పతాకాలను ఆవిష్కరించి క్రీడా ఉత్సవాలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజల మధ్య నిత్యం పని చేసే ప్రజాప్రతినిధులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ వేదిక కేవలం క్రీడల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిందని, రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు, అసెంబ్లీ సమావేశాలతో ఒత్తిడిలో ఉంటారని, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు.


1983లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాప్రతినిధుల కోసం క్రీడా పోటీలను ప్రారంభించారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీలో సుమారు 78 శాతం మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి ఉత్సాహం ఈ క్రీడలకు బలం చేకూరుస్తుందని అన్నారు. ప్రజలు కూడా ఈ పోటీలను వీక్షించి తమ ప్రజాప్రతినిధులను ప్రోత్సహించాలని కోరారు. ముగింపు రోజున ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు.

శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి క్రీడలు దోహదపడతాయని అన్నారు. గతంలో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువతలో క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదికంటే ఈసారి పోటీలను మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ముందుగా ప్రజాప్రతినిధులు స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, డిప్యూటీ స్పీకర్ కే. రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్‌లు జీవీ ఆంజనేయులు, పి. అనురాధ, శాప్ వీసీ & ఎండీ ఎస్. భరణి తదితరులు పాల్గొన్నారు.