జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న పాత్రికేయుల సంక్షేమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలుగు దేశం పార్టీ నాయకులు తెలిపారు. ఏలూరు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సీనియర్ జర్నలిస్టు, ఏపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. శంకర్రావును మంగళవారం ఘనంగా సన్మానించారు.
జంగారెడ్డిగూడెంలోని వారాహీ మూవీ కార్యాలయంలో బుట్టాయిగూడెం డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మర్రి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్రావును దుశ్శాలువాతో సత్కరించి పూలమాలతో అభినందించారు.
ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతం నుండి సీనియర్ జర్నలిస్టు అయిన శంకర్రావును తొలిసారిగా జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పాత్రికేయుల సంక్షేమం కోసం నాలుగు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.
పాత్రికేయుల భవన నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు తెలిపారు. మెట్ట ప్రాంతంలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వార్తల ద్వారా సమాజాభివృద్ధికి పాత్రికేయులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్ర శేషు, యువ నాయకుడు దాకారపు కృష్ణ, సీనియర్ నాయకుడు పెనుమర్తి రామ్‌కుమార్, పట్టణ కార్యదర్శి కోనేటి చంటి, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, సినీ దర్శకుడు బి. ప్రసాద్ రాజు, పాత్రికేయులు డి.వి. భాస్కర్, నాగరాజు, మర్రి రమేష్, క్రాంతి కుమార్, ఉప్పల కృష్ణ, చంద్రగొండ కుమార్ స్వామి, గరువు బాబూరావు, నూజీవీడు కిషోర్, భీమవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







