ఏలూరు, ఫిబ్రవరి 22: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (IFTU) జిల్లా కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీన జిల్లా అధ్యక్షులు కె.వి. రమణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాలపై ఆందోళన, ప్రభుత్వాసుపత్రుల సమస్యలు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు (యు.వి) మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. 8 గంటల పని దినాన్ని తొలగించి 10 గంటల పని విధానానికి రాష్ట్ర ప్రభుత్వం జి.ఓలు జారీ చేయడం కార్మిక వర్గంపై దాడి అని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
హమాలీ కార్మికులకు ఉపాధి భద్రత కలిగిన చట్టం చేయాలని, అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించి పథకాలను మరింత విస్తరించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా కార్మిక హక్కుల కోసం నిరంతర ఉద్యమం కొనసాగించాలన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ, ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీగా మారిన తర్వాత ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని అన్నారు. ప్రమాదాలు, గుండె సంబంధిత వ్యాధులతో వచ్చే రోగులను విజయవాడ లేదా గుంటూరు పంపించడం సాధారణమైందని విమర్శించారు.
ఆసుపత్రిలో 650 పడకలు ఉన్నప్పటికీ తగినంత వైద్యులు, సిబ్బంది లేరని, యంత్ర పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు లేరని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే సిబ్బంది కొరతను నివారించి, డాక్టర్లను నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి 14వ తేదీన ఆసుపత్రి వద్ద నిర్వహించనున్న ధర్నాకు ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పి. నాగేశ్వరరావు, సరియం రామ్మోహన్, సహాయ కార్యదర్శులు ఎం. ప్రసాద్, యర్రా శ్రీనివాసురావు, ఈమని గ్రీష్మ కుమార్, కోశాధికారి ఎం. నాగరాజు, జిల్లా నాయకులు ఎం. అప్పారావు, దూళ్ల వీరినాయుడు, భగాది రమణ, నౌడు నెహ్రూబాబు, పి. గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానితులుగా బి. సోమయ్య హాజరయ్యారు.







