ఏలూరు జిల్లా, చింతలపూడి/సీతానగరం, ఫిబ్రవరి 24: చింతలపూడి మండలం సీతానగరం వద్ద ఉన్న గోద్రెజ్ ఫ్యాక్టరీలో పామ్ ఆయిల్ లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే డ్రైవర్ మృతి చెందినట్లు సహచర డ్రైవర్లు ఆరోపించారు.
ఆదివారం పామ్ ఆయిల్ లోడ్‌తో వచ్చిన లారీ డ్రైవర్ రెండు రోజులుగా ఫ్యాక్టరీలోనే ఉండి అన్లోడింగ్ కోసం వేచి ఉన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం సమయంలో డ్రైవర్ అస్వస్థతకు గురవడంతో ఫ్యాక్టరీలో ఉన్న వైద్యుడిని సంప్రదించాడు. వైద్యుడు పరీక్షించిన అనంతరం మందులు ఇవ్వకుండా చీటీ రాసి బయటికి వెళ్లి మందులు తెచ్చుకోవాలని సూచించినట్లు తెలిసింది.
డ్రైవర్ వద్ద డబ్బులు లేక బయటికి వెళ్లలేక తిరిగి లారీ వద్దకు వస్తుండగా మార్గమధ్యలో కుప్పకూలి పడిపోయినట్లు సమాచారం. అనంతరం అతడిని గుర్తించినప్పటికీ తగిన వైద్య సహాయం అందకపోవడంతో రాత్రి సుమారు 9 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిసింది.
ఈ ఘటనపై ఫ్యాక్టరీలో ఉన్న ఇతర లారీ డ్రైవర్లు యాజమాన్యాన్ని నిలదీశారు. డ్రైవర్‌కు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదని, వైద్యుడు మరియు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆందోళన వ్యక్తం చేశారు.
మరణించిన డ్రైవర్‌ను అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







