జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: జంగారెడ్డిగూడెం పట్టణంలోని జెపి సెంటర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి మూడు దుకాణాల్లో చోరీ యత్నం జరిగిన సంఘటన కలకలం రేపింది. చెప్పుల దుకాణం, చికెన్ సెంటర్ మరియు కిరాణా షాపులోకి చొరబడి దొంగ అందినంత మేర నగదు, వస్తువులు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
దొంగ చెప్పుల దుకాణం షట్టర్‌ను గడ్డపారతో పగులగొట్టి లోపలికి ప్రవేశించి చిల్లర నగదు, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు తీసుకెళ్లినట్లు సమాచారం. చికెన్ సెంటర్ పైకప్పు రేకులు పగులగొట్టి లోపలికి వెళ్లి నాలుగు కోళ్లు కూడా ఎత్తుకెళ్లినట్లు యజమాని తెలిపారు. మరో కిరాణా దుకాణంలో కూడా చోరీ యత్నం జరిగినట్లు తెలిసింది.
తనను గుర్తించకుండా ఉండేందుకు దొంగ దుకాణాల లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే షాపు వెలుపల ఉన్న సీసీ కెమెరాలో నిందితుడి దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడు బాల నేరస్తుడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో బాల నేరస్తుల పాఠశాలలో ఉన్న వ్యక్తి కావచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







