తాజా వార్తలు

10/recent/ticker-posts

వారం రోజుల్లో కోకో ధరల పాలసీ ప్రకటించాలి – లేనిపక్షంలో పోరాటం: ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం హెచ్చరిక


పెడవేగి / విజయరాయి, ఫిబ్రవరి, 22: వారం రోజుల్లోగా కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి, ప్రభుత్వం అధికారికంగా ధర నిర్ణయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కోకో రైతులు ఆందోళనకు దిగుతారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం హెచ్చరించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


పెడవేగి మండలం విజయరాయి గాంధీనగర్‌లోని సీతారామ కళ్యాణమండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కోకో రైతులు పెద్దఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గాయని చెప్పి కిలో కోకో గింజల ధరను రూ.400 నుండి రూ.380కి, ప్రస్తుతం రూ.350కి తగ్గించడం అన్యాయమని విమర్శించారు. ధరల నిర్ణయం జరిగే వరకు కంపెనీలు ధరలు తగ్గించవద్దని ప్రభుత్వం చెప్పినా, కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యానశాఖ అధికారులు స్పందించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో కోకో పంటకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటూ, ఆచరణలో కంపెనీలు ధరలు తగ్గిస్తే స్పందించకపోవడం తగదన్నారు. పెరిగిన పెట్టుబడులు, కౌలు రేట్లు దృష్ట్యా కిలోకు కనీసం రూ.500 కంటే తక్కువ ధర ఉంటే రైతులు తీవ్ర నష్టాల్లో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ధరల నిర్ణయ కమిటీలో కేవలం కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరపడం సరికాదని, కోకో రైతుల సంఘం ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ధర నిర్ణయించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.

అలాగే, ధరలపై ప్రశ్నిస్తున్న రైతులపై కంపెనీలు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమని, ఇటువంటి ధోరణి వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.

సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి మాట్లాడుతూ, కోకో కాంక్లేవ్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించిన విధంగా ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయం మాదిరిగా ఫార్ములా ఆధారంగా కోకో గింజల ధరను నిర్ణయించాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతుల సంఘం నాయకులు పాలడుగుల నరసింహారావు, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు, మొరంపూడి సుబ్రహ్మణ్యం, పానుగంటి సుధాకర్, ఎస్ఆర్‌కెజి చౌదరి, పోలిన అప్పారావు, చేకూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.