ఓదూరులో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి సుభాష్
రామచంద్రపురం, 03 జనవరి 2026(పశ్చిమ వాహిని): రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాలతో ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం ఓదూరు గ్రామంలో తహశీల్దార్ మృత్యుంజయరావు అద్యక్షతన రైతులకు పాసుబుక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పంపిణీ చేసిన పాసు పుస్తకాలను రద్దు చేసి, నిర్ధిష్టమైన సమాచారంతో రాజముద్రతో రైతులకు అందించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అంతులేని భూ సమస్యలు ఉత్పన్నం కావడంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రైతుల హక్కులను కాపాడుతూ, వారి ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వo పనిచేస్తుందన్నారు. భూ సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేసి అన్నదాతల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
తహసిల్దార్ మృత్యుంజయరావు, వీఆర్వో లత, సీనియర్ అసిస్టెంట్ రామారావు, రామచంద్రపురం రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కూటమి పార్టీ నాయకులు అద్దంకి సత్య సాయి బాబా, సలాది కృష్ణ, కొండేపూడి శ్రీ నాగ తిరుపతిరావు, బుంగా అప్పారావు, కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు, అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








