తాజా వార్తలు

10/recent/ticker-posts

సావిత్రిబాయి పూలే జయంతి ని భారత మహిళా విద్యా దినంగా ప్రకటించాలి. యాట్ల


ద్రాక్షారామ,03 జనవరి 2026(పశ్చిమ వాహిని): భారతదేశంలోని సామాజిక కట్టుబాట్లను సనాతన సంప్రదాయాలను ధిక్కరించి మొదటి బాలికల పాఠశాల ను స్థాపించిన క్రాంతిజ్యోతి, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని నియోజకవర్గం ఎం.బీ.సీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు. 


సావిత్రిబాయి పూలే 195 వ జయంతి సందర్భంగా ద్రాక్షారామ మసీదు సెంటర్ లో ఉన్న పూలే దంపతులు విగ్రహాలకు కొండేపూడి వినయ్ కుమార్, పడిడదకల బీమశంకరం, బిల్లకుర్తి స్వామి, గారోజు సూరిబాబు, షేక్ సిద్ధూ, కొల్లఫు కామేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

అనంతరం యాట్ల మాట్లాడుతూ స్త్రీకి చదువు హక్కు లేని చీకటి కాలం, ఆ కాలంలో మహిళలకు చదువు అనేది పాపంగా భావించబడేది. ఆడవాళ్ళు చదివితే బుద్ధి నశిస్తుంది అనే అంధ విశ్వాసాలు ఉండేవి. మహిళలు ఇంటి పనులు, వంట, పిల్లలను పెంచడం వరకు మాత్రమే పరిమితయ్యేవారు. కులం, మతం, లింగం అన్నింటి పేరుతో విద్యా ద్వారాలు మూసివేయబడ్డాయి. 

అలాంటి పరిస్థితుల్లో స్త్రీకి చదువు అనేది మానవ హక్కు అని భావించిన సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే సహకారంతో 1848 జనవరి 1న మహారాష్ట్ర లోని పూణే నగరంలో మొట్ట మొదటి బాలికల పాఠశాల ను స్థాపించారు. 

ప్రతీ రోజూ బడికి వెళ్ళేటప్పుడు ఆమెపై రాళ్ళు, మలినాలు, వేయబడినా అపహాస్యం, దూషణలు ఎదురైనా ఆమె అడుగులు ఆగలేదు. ఆమె చేతిలోని పుస్తకం పడిపోలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు. ఒక బాలిక చదువుకుంటే ఒక తరం వెలుగులోకి వస్తుందని. 

ఈ రోజు బాలికలు చదువుతున్నారంటే వారి చేసిన త్యాగాలు మరువ లేనివి.ఇది ఒక సామాజిక జ్ఞాపకం, ఇది ఒక విప్లవ స్మరణ, విద్యే విముక్తికి మార్గం అని తెలిపారు. జనవరి 3న భారత మహిళా విద్యా దినంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి. రామకృష్ణ, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.