తెలంగాణా రాజకీయాలు నీటి వివాదాలు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళూ ఇవన్నీ కలసి ఏపీ సీఎం చంద్రబాబుని మధ్యలోకి లాగుతున్నాయి. ఏపీకి తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబును ముగ్గులోకి లాగేశారు. తాను సూటిగా బాబుకు చెప్పడం మీదనే ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేశారు అని నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలనం రేపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలుపు చేయాల్సిందే అని తాను షరతు పెట్టాను అన్నారు. అలా చేసిన పక్షంలోనే ఏపీతో తాము ఏ చర్చకు అయినా సిద్ధపడతామని కూడా ఆయన చెప్పారు. అయితే తాను చెప్పిన మాటను విన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ విధంగా పనులు ఆపేశారు అని రేవంత్ రెడ్డి చెప్పారు.
తాను తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా పోరు చేస్తాను అని చెప్పారు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా ఇదే తీరున తాను ఒత్తిడి పెట్టానని చెప్పారు. తాను తెలంగాణాకు అన్యాయం చేయను అని చెప్పి ముందు ప్రాంతం తరువాతనే పార్టీ అని కూడా తెలియచేసి ఆనాడు టీడీపీ నుంచి బయటకు వచ్చాను అని కూడా రేవంత్ రెడ్డి సభకు స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం రాజీ పడే ప్రసక్తి లేదని ఎవరితో అయినా పోరాడుతాను అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన గట్టి ప్రయత్నాల వల్లనే ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయని ఆయన బల్ల గుద్ది మరీ చెప్పారు.
ఒకవేళ ఎవరికైనా ఏ రకమైన డౌట్ ఈ విషయంలో ఉంటే అసెంబ్లీ స్పీకర్ ని కమిటీ వేయాలని ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోరారు. ఆ కమిటీలో బీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ వామపక్షాలు సహా అంతా ఉండొచ్చని మీరంతా వెళ్లి ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగాయో లేదో చూసి రావాలని కూడా రేవంత్ రెడ్డి కోరడం విశేషం. ఒక విధంగా తాను ఏపీ మీద సాధించిన విజయంగా పై చేయిగా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పదలచారు అని అర్ధం అయింది. అంతవరకూ బాగానే ఉన్నా ఏపీ ఈ విషయంలో చిక్కుల్లో పడింది అని అంటున్నారు.
దీని మీద ఏపీలో విపక్షం అయిన వైసీపీ మండిపడుతోంది, తమ సొంత రాజకీయాల కోసం ఏపీని చంద్రబాబు తాకట్టు పెట్టారు అని వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి విమర్శిస్తున్నారు. రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం రాశారు అని ఆయన మండిపడ్డారు. బాబు చర్యలతో రాయలసీమ మొత్తం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ ఈ విధంగా చంద్రబాబు మీద విమర్శల దాడి పెంచేందుకు అవకాశం ఏర్పడింది అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ విషయం మీద టీడీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది తప్పు అని కూడా ఏపీ టీడీపీ ఖండించింది. వైసీపీ హయాంలో ప్రాజెక్ట్ అవకతవకగా ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టారని నిందించింది. అందువల్లనే పనులు నిలిచిపోయాయని టీడీపీ స్పష్టం చేసింది. తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేస్ధన్ పనులు ఆపేసింది అన్నది పూర్తిగా అబద్ధం అని పేర్కొంది. ఇక దీంతో రేవంత్ రెడ్డి మీద టీడీపీ ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య జల జగడం డైలాగ్ వార్ కాస్తా చంద్రబాబు వైపు రావడంతో ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా కొత్త వార్ స్టార్ట్ అవుతోంది. చూడాలి మరి ఇది ఎంత దూరం వెళ్తుందో.







