రామచంద్రపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ ఏరియా హాస్పిటల్ నందు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన యువకులను అభినందించిన తొగరు మూర్తి. ఈ సందర్భంగా తొగరు మూర్తి మాట్లాడుతూ స్వామి వివేకానంద మాటల్లో యువత అంటే కేవలం శారీరక వయస్సు కాదు, ధైర్యం ఆత్మవిశ్వాసం త్యాగబుద్ధి మరియు సేవాభావం... ఆయన అన్నమాటలు నేటికీ ప్రతీ హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
నాకు పదిమంది నిజాయితీగల యువకులు కావాలి ఈ దేశ స్వరూపాన్ని మార్చి వేస్తాను. ఇదీ యువశక్తిపై స్వామి వివేకానందకు ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం. డిగ్రీలతోపాటు ఆత్మగౌరవం మన వ్యక్తిత్వంలో భాగం కావాలి, ఉద్యోగం ఒక ఆర్థిక అవసరం కావచ్చు కానీ ఉన్నతమైన ఉద్దేశం, సేవా భావం మన జీవన లక్ష్యం కావాలి అని స్వామి వివేకానంద పిలుపునిచ్చేవారు.
ఈరోజు వారి కలలను నిజం చేస్తూ రక్తదానం ద్వారా ప్రాణదానం చేస్తున్న మీవంటి యువకులే అందరికీ ఆదర్శనీయులని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మీ రక్తదానం అత్యవసర సమయంలో పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 1893 సెప్టెంబర్ 11న అమెరికా చికాగో పట్టణంలో జరిగిన సమావేశానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరై మాట్లాడుతూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ ఉపన్యాసం ప్రారంభించిన పదాలు వినగానే అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల అమితమైన గౌరవం ఏర్పడింది.
అంతటి ప్రతిభావంతశాలి ఆయన స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలు నెరవేర్చుకుంటూ దేశభక్తి కలిగి త్యాగబుద్ధి కలిగి సమాజ సేవ చేయాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని ఏరియా హాస్పిటల్ సూపరిండెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చక్రధర్, ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శేఖర్, నర్సింగ్ సూపరిండెండెంట్ జయప్రద, ఎన్జీవో సభ్యులు, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ చింతపల్లి వాసు, చక్రధర్, బి వాసు తదితరులు పాల్గొన్నారు.







