Hot Posts

6/recent/ticker-posts

మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో బాపట్లకు సరికొత్త శోభ: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు


గడియార స్తంభం, పాత బస్టాండ్, చిలురోడ్ జంక్షన్ల క్షేత్రస్థాయి పరిశీలన
ట్రాఫిక్ సమస్యలు లేకుండా జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు
చారిత్రక నగరంగా బాపట్లను తీర్చిదిద్దుతామని వెల్లడి..


ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల: పట్టణాన్ని ఒక చారిత్రక సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల ఎమ్మెల్యే  వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. మంగళవారం ఆయన బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ సి.ఐ రాంబాబు, మున్సిపల్, రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పర్యటించి, విగ్రహాల ఏర్పాటుకు అనువైన స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 

ఎమ్మెల్యే పట్టణంలోని అతి ముఖ్యమైన గడియార స్తంభం (క్లాక్ టవర్) సెంటర్, పాత బస్టాండ్,  చిలురోడ్ (చీరాల రోడ్డు) కూడళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పట్టణ సుందరీకరణ పనులకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విగ్రహాల ఏర్పాటు వల్ల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, రహదారి వెడల్పును దృష్టిలో ఉంచుకుని జంక్షన్లను రీ-డిజైన్ చేయాలని ఆదేశించారు. 

విగ్రహాల చుట్టూ గ్రీనరీ (మొక్కలు), అత్యాధునిక విద్యుత్ దీపాలు పట్టణవాసులు కూర్చునేలా చిన్నపాటి ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించాలని సూచించారు. కేవలం విగ్రహాల ఏర్పాటుతోనే కాకుండా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ఫుట్‌పాత్‌ల నిర్మాణం ద్వారా మెయిన్ రోడ్డుకు సరికొత్త రూపు తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్‌కు దిశానిర్దేశం చేశారు. 

"మన చరిత్రను, సంస్కృతిని కాపాడిన మహనీయుల విగ్రహాలను పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ద్వారా నేటి యువతకు వారి ఆశయాలను గుర్తు చేసినట్లవుతుంది. బాపట్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు,అధికారులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.