డాక్టర్ అంబేద్కర్ కోనసిమ, ద్రాక్షారామం: రామచంద్రపురం మండలం హసన్‌బాద గ్రామంలో సోమవారం సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో, వికసిత భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా భారత పార్లమెంట్ వికసిత భారత్ రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025ను ఆమోదించిందని సర్పంచ్ గ్రామస్థులకు వివరించారు.
ఈ చట్టం ద్వారా ఉపాధి శ్రామికులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం, సామాజిక–ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు, నిరుద్యోగ భృతి, సమయానికి వేతనాల చెల్లింపులు వంటి అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్‌జీఓ వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామ పారిశుద్ధ్యంపై గ్రామస్థులతో చర్చించారు. అనంతరం మండల రెవెన్యూ సిబ్బంది ఆర్.ఐ వాసంశెట్టి సత్యదేవ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పంపన రామారావు గ్రామసభలో పాల్గొన్నారు.
రైతులకు రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్‌పుస్తకాలను సర్పంచ్ సతీష్ రావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ చింతపల్లి వీరభద్రరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. సర్వే లేదా పాస్‌పుస్తకాల ముద్రణలో లోపాలుంటే సరిదిద్దుతామని ఆర్.ఐ ప్రసాద్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సబ్బెల్ల ప్రసాద్ రెడ్డి, వీఆర్‌ఓ నరహరిశెట్టి సత్తిబాబు, సచివాలయం రెవెన్యూ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.







