చింతలపూడి, జనవరి 3 (పశ్చిమ వాహిని): భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా చింతలపూడి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమం ప్రారంభంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, మహిళా విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సావిత్రిబాయి ధైర్యసాహసాలకు పెట్టింది పేరని, మహిళా లోకానికి ఆమె ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో మహిళల విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
కార్యక్రమ నిర్వాహకుడు బి. శ్రీనివాసరావు సావిత్రిబాయి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఉదాహరణలతో వివరిస్తూ, సామాజిక మార్పుకు ఆమె చేసిన కృషిని వివరించారు.
వందన సమర్పణతో కార్యక్రమం ముగియగా, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







