తూర్పు గోదావరి జిల్లా, తణుకు, జనవరి 25: బాలబాలికలు బాల్యంలో కులమతాలకు అతీతంగా ఏవిధంగా స్నేహంతో ఉన్నారో, అదేవిధంగా యవ్వనంలో కూడా అదే స్నేహభావంతో మెలగాలని ప్రముఖ నేత్రవైద్యులు, తణుకు బాలోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు డా.హుస్సేన్ అహమ్మద్ విద్యార్థులకు హితవు పలికారు. నేటి సమాజంలో యవ్వనంలో ఉన్న యువతీ యువకుల మధ్య కొన్ని సంఘ విద్రోహక శక్తులు కుల మతాల ప్రాతిపదికన చిచ్చు రగులుస్తున్నాయనీ, అటువంటి సంఘ విద్రోహక శక్తుల పట్ల యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని డా.హుస్సేన్ అహమ్మద్ హితవు పలికారు.
ఆదివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరిగిన తణుకు బాలోత్సవం వేడుకల ముగింపు సభలో డా.హుస్సేన్ అహమ్మద్ ప్రసంగించారు. బాలోత్సవం ముగింపు సభకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు, బాలోత్సవం నాయకులు పి. ఎల్. నరసింహారావు అధ్యక్షత వహించారు.
పి.ఎల్.నరసింహారావు మాట్లాడుతూ, తాము నిర్వహించిన ఈ మూడవ బాలోత్సవంలో 48 విభాగాల్లో వందలాది మంది విద్యార్థులు పోటీ పడ్డారనీ, ప్రతీ విభాగంలో ప్రతిభ గల విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల, విజేతలను నిర్ణయించడం న్యాయ నిర్ణేతలకు కష్టంగా మారిందని అన్నారు. బాలోత్సవం ప్రారంభం రోజున పాల్గొన్న మూడు వేల మంది విద్యార్థులు సభలో పాల్గొన్న పెద్దలతో సామూహిక "వందేమాతరం" గీతాలాపన చేయడం ద్వారా "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో నమోదు అయ్యి ధృవ పత్రం పొందినట్లు, ఇది తణుకు చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పి.ఎల్.నరసింహారావు చెప్పారు.
విద్యార్థులు సెల్ ఫోన్ ను వాడరాదనీ, సెల్ ఫోన్ వల్ల లాభాలు, నష్టాలు రెండూ కూడా ఉన్నాయని బాలోత్సవం కార్యనిర్వాహక కమిటీ చైర్మన్, మానవత నాయకులు గమిని రాంబాబు విద్యార్థులకు హితవు పలికారు.
శ్రీ శ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి, బాలోత్సవం నాయకులు పోపూరి దక్షిణా మూర్తి తమ సుదీర్ఘమైన, స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలో బాలోత్సవం యొక్క నిర్వహణ ఆవశ్యకత గురించి వివరించారు. బాలోత్సవం విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడం, వారిని పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్య పరచడం, విద్యార్థులు కుల మతాల పట్ల విచక్షణ లేకుండా స్నేహ భావంతో జీవించేలాగున ప్రోత్సహించడం, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ఆ కళల్లో ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో పనిజేస్తున్నట్లు పోపూరి దక్షిణా మూర్తి వివరించారు.
తణుకు ఆంధ్రా షుగర్స్ ఆర్థిక శాఖ వైస్ ప్రెసిడెంట్ పి.వి.విశ్వనాథ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు బాల్యంలోనే చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. చక్కని తెలుగు పద్యం ద్వారా చదువు యొక్క విలువ తెలిపారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న రాజమహేంద్రవరం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం నుండి విచ్చేసిన మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్.ఐ.సి సంస్థ యాభై ఏడు లక్షల కోట్ల ఆస్తి కలిగి యున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ అని చెప్పారు. తమ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక సహకారం అందజేస్తుందనీ, విద్యార్థినీ విద్యార్థులకు తమ సంస్థ ఉపకార వేతనాలు అందజేస్తుందని వెంకటేశ్వర రావు చెప్పారు. తమ సంస్థ ప్రతీ సంవత్సరం ఉత్తమ విద్యార్థిని కూడా ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయాలకు దరఖాస్తు చేసుకొనే విధానం గురించి తమ సంస్థ కార్యాలయాలలో అడిగి తెలుసుకోవాలని వెంకటేశ్వరరావు చెప్పారు.
బాలోత్సవం కార్యక్రమంలో ఎల్.ఐ.సి తణుకు బ్రాంచ్ మేనేజర్ కె.ఎస్. రాజ శేఖర్, మేనేజర్ శంకర్ పాల్గొన్నారు. బాలోత్సవం నిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు డా. జుత్తిగ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువు యందు మనసు నిలపాలనీ, ఇతర విషయాల వైపు మనసు మళ్ళించకుండా నియంత్రణతో వ్యవహరించాలని చెప్పారు. నేడు ఇష్టపడి, కష్టపడి చదువుకుంటే, రేపు అందమైన భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు హితవు పలికారు. ఈ సందర్భంగా తణుకు బాలోత్సవం గేయ రచయిత కోట రామ ప్రసాద్ కు బాలోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు జ్ఞాపిక బహూకరించి అభినందించారు.
ఈ బాలోత్సవం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు, న్యాయ నిర్ణేతలు, వివిధ విద్యా సంస్థల నుండి సుమారు నలభై ఎనిమిది విషయాల పోటీలలో పాల్గొని ప్రధాన, ద్వితీర, తృతీయ, కన్సోలేషన్ బహుమతుల విజేతలుగా ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు సుమారు ఐదు వందల జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు బాలోత్సవం నిర్వహణ కమిటీ అందజేసింది. కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలికులు, సైకాలజిస్ట్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు బి.యం.గోపాల రెడ్డి తమ మ్యాజిక్ ద్వారా విద్యార్థినీ విద్యార్థులను సభికులను ఆకట్టుకున్నారు.
ఈ బాలోత్సవం ముగింపు సభలో తిరుమల విద్యా సంస్థల ప్రతినిధి సతీష్, తణుకు మానవత శాఖ అధ్యక్షులు కె. రాజ రాజేశ్వర రావు, తణుకు మానవత కార్యదర్శి కె.కె.వి.రాజు, తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ సీహెచ్. రామకృష్ణ, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు శ్రీమతి శ్రీదేవి, బాలోత్సవం కోశాధికారి ఏ.ఎస్. Vi. శేషుబాబు, బాలోత్సవం నిర్వహణ కమిటీ సభ్యురాలు శ్రీమతి యర్రా రాజ్యలక్ష్మి, ప్రైవేట్ స్కూల్స్ సంఘ నాయకులు బి.విద్యాకాంత్, శశాంక్ ప్రభృతులు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పుర జనులు పాల్గొన్నారు.
బాలోత్సవం బహుమతి ప్రదాన సభలో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్న పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మొదలగువారు పాల్గొని సభను జయప్రదం చేశారు.







