Hot Posts

6/recent/ticker-posts

ఏలూరులో ఏపీ రైతు సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ


ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా గురువారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా షేక్ హబీబ్ బాషా మాట్లాడుతూ, రైతాంగ సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ వ్యవసాయ మెలుకువలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పాత్ర అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా వివిధ వ్యవసాయ సంబంధ శాఖల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లడం ద్వారా రైతులకు మేలు జరుగుతోందని తెలిపారు.

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని గ్రామాల్లో రైతులు సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు గ్యారెంటీగా అందేలా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని, కోకో, కొబ్బరి తదితర పంటల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించి, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. రామ్మోహనరావు, జిల్లా ఉద్యాన అధికారి షాజా నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శివ శ్రీరామమూర్తి తదితర ఉన్నతాధికారులకు రైతు సంఘం క్యాలెండర్‌లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, నాయకులు గండి రాజా, ఎస్. అప్పారావు, పలువురు రైతులు పాల్గొన్నారు.