ఏలూరు జిల్లా చాట్రాయి, చనుబండ: మామిడి పంటలో పూత–పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడవలసిన రసాయన మందులు, కోడి పేను నివారణతో పాటు పలు వ్యవసాయ అంశాలపై ఈరోజు చనుబండ చచివాలయం–1 నందు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాస్త్రవేత్త శ్రీమతి డా. విజయలక్ష్మి, నూజివీడు ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి పాల్గొని రైతులకు విలువైన సూచనలు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పంటను దశల వారీగా సాగు చేయాల్సిన అవసరం ఉందని, ఏ దశలో ఏ మందులు వాడాలి, నీటిని ఎప్పుడు అందించాలి, మందులు ఎలా పిచికారీ చేయాలి అనే విషయాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా మామిడి పంటలో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిందె దశలో కవర్లు ఎప్పుడు వాడాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే భూమిలో నుండి వచ్చే కోడి పేను సమస్యను ప్రారంభ దశలోనే ఎలా నివారించుకోవాలో యాప పిండి, యాప చక్క వాడకం ద్వారా నియంత్రణ చర్యలను వివరించారు. కూరగాయలు, ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి తోటల్లో వేసే అంతర్పండల సాగుపై కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి రైతులకు తెలియజేశారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకూ పంటలపై సబ్సిడీ అందుబాటులో ఉందని, ఏ పంటకు ఎంత సబ్సిడీ, ఏ సమయంలో అందుతుందనే వివరాలను రైతులు తెలుసుకుని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు కర్పూరి మాట్లాడుతూ, రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, రుణాలు ప్రతి రైతుకు చేరేలా విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
ఈ అవగాహన సదస్సులో చనుబండ రైతు భరోసా కేంద్ర అగ్రికల్చర్ అసిస్టెంట్ నాగమణి, చనుబండ పీఏసీఎస్ అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస్ రావు, కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతకుంట వెంకటేశ్వరరావు, నక్కా రాము, గౌరవ వెంకటేశ్వరరావు, బొట్టు దుర్గారావు, మోతుకు ముత్తయ్య, మోరంపూడి సత్యనారాయణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.








